2013-01-28

గర్జించు రష్యా, గాండ్రించు రష్యా!

మహా సైబర్ సముద్రమైన అంతర్జాలంలో ఓ సుక్ష్మమైన బిందువు ఈ బ్లాగు. పులుసులో ముక్క, ఆటలో అరటి పండే కాదు, పులుసులోని ముక్క మీద చుక్క, ఆటలో అరటి పండులో ఓ గింజ. ఇక్కడికొచ్చే చాలా మంది పాఠకులు (బ్లాగర్. కాం వారు "ప్రేక్షకులు" అనే పదం వాడుతున్నారు, "పాఠకులు" అంటే ఇంకా బాగుంటుంది అన్నది నా అభిప్రాయం) ముఖ్యంగా ఇండియా, అమెరికా వాసులు. కొద్ది మంది ఆస్ట్రేలియా, సింగపూర్ వాసులు; అంతా తెలుగు వాళ్ళు , ప్రవాసాంధ్రులు ఎక్కువగా ఉండే దేశాలు, ప్రదేశాలు.

ఒక్క రష్యా మనహా. దేశాల వారీగా చూస్తే, ఇండియా, అమెరికాల తరువాత రష్యా పాఠకులు మూడో స్థానంలో ఉన్నారు. అక్కడ ఎక్కువ సంఖ్యలో ప్రవాసాంధ్రులు లేరన్నదే నా అభిప్రాయం. అంటే, ఈ పాఠకులంతా రష్యా జాతీయులే. రష్యా వారికి తెలుగుపై ఆసక్తి ఉన్నదనే అంశము విదితమే; ఇంగ్లీషు కాని ఓ అంతర్జాతీయ భాష నేర్చుకోవలని నేను ఎప్పుడో మా తాతగారికి చెప్పితే, ఆయన ఢిల్లీలోని పాలికా బజార్ అంతా వెతికి, నాకు ఓ తెలుగు-రష్యన్ నిఘంటువు సెకెండ్ హ్యాండ్ లో కొని బహుకరించారు. అది రష్యన్-తెలుగు నిఘంటువు కాక తెలుగు-రష్యన్ నిఘంటువు అవడం చేత (అంటే, తెలుగు పదాలకు రష్యన్ అర్థాలు), నాకు ఎక్కువ ఉపయోగకరం అవ్వలేదు. అది వేరే విషయంలేండి.

ఏది ఏమైనా, రష్యన్ పాఠకులందరికీ హృదయ పూర్వకమైన привет! ("ప్రివెట్"; రష్యన్లో "హెలో") నాకు అంతకంటే రష్యన్ రాదు. మా ఆవిడకి ఇంకాస్త రష్యన్ - ఓ వాక్యం - తెలుసు, అయితే, ఆ పదాలకు నా నోరు తిరుగదు. పలకగలిగినా ఇక్కడ ఎక్కువ ప్రయోజనం లేదు, ఎందుకంటే ఆ వాక్యానికి అర్థం, "క్రెంలిన్ కి ఏ మెట్రో లైన్ తీసుకోవాలి" అన్నది. తెలుగు బ్లాగింగ్ పై మీకున్న ఆసక్తికి జోహారు! ఏదైనా అర్థం కాకపోతే గూగుల్ ట్రాన్స్ లేట్ వాడండి. నకిలీ మందులు, సాఫ్ట్ వేర్ కొనుగోలు, స్విస్ బ్యాంకులలో నిలిచిపోయిన ఆఫ్రికా బ్లాక్ మనీని స్వేతపరచడం వంటి ప్రతిపాదనలుంటే తప్పకుండా వేగు పంపండి!

కామెంట్‌లు లేవు: