2010-09-27

స్థూల అర్థ శాస్త్రము అభ్యసించుటకు తెలుగే మేలు

నాకు శిక్షణ వున్నది కంప్యూటర్లలో. అభిరుచులున్నవి భాషా శాస్త్రము, ఇతిహాసములలో. ఆసక్తి వున్నది వాంగ్మయంపై. అసలు అర్థంకానిది, అర్థ శాస్త్రము; ఒక్కో సారి గణాంకాలు ప్రథానంగానూ, మరి కొన్ని సార్లు గుణాత్మకంగానూ నడిచే ఈ శాస్త్రములోని వాదసరళి కాస్త వైవిధ్యముగా, పలకలేకలేని సాంకేతిక పదాలతో అనూహ్యరీతిలో పరుగులు తీస్తుంది. ఆర్థిక శాస్త్రమనే నగరంలో విహరించుటకు మీకు తెలుగు మ్యాప్ వుండడమే మేలన్నది నా వాదన.

ఇలా అనడానికి ప్రథమ కారణం, అర్థంకాక పలకలేని పదాలుండడం. యేటేటా ఆర్థిక శాస్త్రములో ఇచ్చే నొబేల్ బహుమతి గురించి వినే వుంటారు; 1998లో దశాబ్దాల బట్టీ విదేశాలలో వుంటున్నా ఇంకా భారతీయ పాస్పోర్ట్ వుంచుకున్న ఒక మేధావికి ఆ బహుమతి ఇచ్చారు. ఆ బహుమతి నొబేల్ ఫౌండేషన్ వారిచ్చేది కాదు కాబట్టి, నిజ నొబేల్ బహుమతిగా పరిగణించకోడదు, ‘అల్ఫ్రెడ్ నొబేల్ జ్ఞాపకార్థం ఆర్థిక శాస్త్రములో స్వెరిజెస్ రిక్స్ బే్ంక్ వారి బహుమతి’ అని పిలవాలన్నది కొందరి వాదన. ఈ వాదన తప్పో, ఒప్పో నాకు తెలియదు కానీ, పదాలను దీక్షగా చూడండి: ఈ బహుమతి ఇస్తున్న వారి పేరు రోమన్ లిపిలో Sveriges Riksbank. తిలకించండి: Sveriges. తెలుగులో ముందర చదవకుంటే మీకది స్వెరిగస్ ఓ, స్వెర్గ్ స్ యో, స్వెరిజెస్ ఓ తెలియదు. నేను స్వెరిజస్ అని పిలుస్తున్నాను కాబట్టి మీ మదిలో కూడా ఈ పదము యొక్క ఉచ్చారణ ఇలా అతుక్కుపోయింది. చూశారా, తెలుగు లిపిలోని గొప్ప తనం.

సరే , తెలుగులో పిలవడానికి సులభమయ్యింది కానీ, ఈ ఉచ్చారణా సౌలభ్యము ఏ కఠిన పదాలకైనా వర్తిస్తుంది కదా, ప్రత్యేకించి స్థూల అర్థ శాస్త్రానికే వర్తించేది ఏమున్నది అని మీరు అడగచ్చు. మరీనకునేది సబబే. అది అర్థం కావాలంటే, ఆ స్వె.రి. బహుమతినే, ఇంకో పదేళ్ళ తరువాత, అంటే, 2008లో, గెలుచుకున్న వారి వాఖ్యలను మీరు తిలకించాలి. ప్రస్తుక ఆర్థిక మాంధ్యం (క్షమించండి, అమెరికాలో మాంధ్యం 15 నెలల కిందటే నశించింది) ఆర్థిక దురోగతి / ఖబుర్లను విశ్లేషించడానికి డా. పోల్ కృగ్ మెన్ గారి పుస్తకాలూ, వ్యాసాలు, బ్లాగు ఎంతగానో సహకరిస్తాయి. ఆయన ఇవ్వాళ్ళన్న మాటలివి:

నారాయణ కోచెర్లకోటతో నాకున్న ఇబ్బంది: ఆయనకు తన పేర్లో మరీ ఎక్కువ అక్షరామూర్తులున్నాయి! అంటే, మిత్రులారా, మామూలు శీర్షిక నిమిత్తమైన చోటులు పట్టాలి – మినియాపోలీస్ సంయుక్త రిజర్వ్ బ్యాంకు అధినేతను ప్రస్తావించనప్పుడల్లా అరుదైన పత్రికా భూస్థితి కోల్పోతునాను.

నాకో కొత్త నియమం కావాలి – పాలసీ చర్చలో పాల్గొనే వాళ్ళకంతా న్గ్, లేదా ఇప్ లాంటి పేర్లే వుండాలి. నన్ను మీరు క్న్ అని పిలవచ్చు.

పోనీ, [అందరి పేర్లలోనుంచి] అచ్చులను తొలగిద్దామా?

క్న్ అని పలకడం అందరికీ సులభమయినా, తరతరాల నుంచి వస్తున్న ఆష్కెన్ నాట్సీ వారసత్వమును వీడి, అంతరిస్తున్న యిడ్డిష్ భాషలో ఉన్న పోల్ గారి ఇంటి పేరును తీసివేయడం నాకంత ఆమోదకప్రాయంగా కనబడుటలేదు. పైపిచ్చు - అంటే ఇది ఎన్నంటికీ అవలేదనుకోండి - కానీ, ఒక వేళ ఆయన ఏవో తప్పులు పలికితే కృగ్ మెన్ ఖంగు తిని కృంగిపోయాడు అనే వార్తా శీర్షికను మనం రాయలేము. అంత కంటే సులభ మార్గము కృగ్ మెన్ గారికి ప్రస్తావిద్దాం:- స్థూల అర్థ శాస్త్ర చెర్చలన్నీ తెలుగులోనే కొనసాగించండి! ఈ ప్రదిపాదనతో మీకు చాలా లాభాలు:

1) శాస్త్రవెత్తల పేర్లు సులభంగా పట్టికలో పట్టుతాయి
పోల్ కృగ్ మెన్ పేరే చూడండి, ఆంగ్లములో పేరు, ఇంటి పేరు 4 + 7 అక్షరాలైతే తెలుగులో 2 + 2 అక్షరాలయ్యాయి. అలాగే, కోచెర్లకోట గారి పేరు కేవలం 4 + 4 అక్షరాలతోనే కానివచ్చు. చాలా ఖరీదైన పత్రికా భూస్తితిని పొదుపు చేసుకోవచ్చు.

2) తూర్పాసియా దేశాలతో పోటీ పడచ్చు
అంతే కాదు, మీరెవ్వరూ ఊహించని ఇంకో లాభాంశము ఇంకొకటి వుంది. అధికాదాయంతో, వాణిజ్య రంగంలోనూ, ఉపనిర్మాణలలోనూ చైనా, దక్షిణ కొరియా వంటి తూర్పాశియా దేశాలు, మనకీ, పాస్చాత్య దేశాలకీ ఎంతగా పోటీ ఇస్తున్నాయో మీకే తెలుసు. ఇక పత్రికా భూస్తితి విషయంలో కూడా తక్కువ శబ్దగుణలతో ఎంతగా వారు ముందున్నారో మీరే చూడండి. చైనా అధినేత పేరు Hu Jintao. ఇంటి పేరు కేవలం రెండు రోమన్ అక్షరాలు. కానీ, తెలుగు లిపి వాడుకతో ఈ సుప్రయోజనం చాలా మడుకూ తగ్గకలదు. చైనాలో నూతన ఆర్థిక విధానాలను ప్రవేశ పెట్టిన డెంగ్ సియావుపింగ్ గారి విషయమే చూడండి. రోమన్ లిపిలో అక్షరాల సంఖ్యకూ, తెలుగు లిపిలో అక్షరాల సంఖ్యకూ అంత తేడా లేదని మీరు అనుకోవచ్చు.అయితే, పాస్చాయితీలూ, భారతీయుల పేర్లలో తగ్గింపు వుంటుంది కాబట్టి స్వాభివకంగా చిన్నవైన తూర్పాసియా దేశస్తుల పేర్లను తెలుగులోకి దిగుమతి చేయడం వల్ల వారికున్న లాభాన్ని మనం ఇంచుమించు పోగొట్ట గలము.

3) పేర్లు సులభంగా పలకచ్చు
పేర్లను సులభంగా రాయడమే కాదు, సులభంగా ఉచ్చరించచ్చు కూడా. స్వెరిజెస్ కానివ్వండీ, కృగ్ మెన్ కానివ్వండి, నస్సీం నిఖోలాస్ తాలెబ్ (ఈయన పేరు రోమన్ లిపిలో ఇంకోలా చదివారు కదూ!) కానివ్వండి, నోరియల్ రౌబీనీ కానివ్వండీ, జేకబ్ బ్రోఖ్నర్ మేడ్సెన్ కానివ్వండి, చివరికి నారాయణ కంచుకోట గారే కానివ్వండి, అందరి పేర్లను సులభంగా పలకాలంటే తెలుగులోనే రాయడం మేలు.

4) తెలుగు మాట్లాడగలిగిన ఆర్థిక శాస్త్రవేత్తలు
అంతర్జాతీయంగానే కాదు, జాతీయంగా కూడా ఆర్థికంశాలను తెలుగులోనే పరిగణించడం సబబు. ఇండియోలో సరళీకృత ఆర్థిక విధానలను ప్రవేశపెట్టినప్పటి నుండీ ఇప్పటికి వరకూ, ఒక్క బిమల్ జలాన్ గారు మినహా, భారతీయ రిజర్వ్ బేంక్ యొక్క గవర్నర్లందరూ తెలుగు మాట్లాడే వారే. ఈ సరళీకృత విధానలను ప్రవేశ పెట్టిందీ తెలుగోడి హయాములోనే. అంటే, దేశంలో ఇంత ఆర్థిక పెరుగుదల రావడానికి కారణం తెలుగులో ఆలోచించడమే! ఈ విజయం ఆర్థిక సమస్యలతో ఇంకా బాధపడుతున్న ఇతర దేశస్తులతో పంచుకోవడం మన నైతిక బాధ్యత.

5) అర్థమయ్యేటటు వంటి సాంకేతిక పదకోశము
ఇంగ్లీషులో వీళ్ళ గోల అర్థం కాక చస్తున్నాను. పోనీ, అర్థంకానిది వ్యర్థం అని పక్కన తోసేద్దామంటే, నిరుద్యోగం, గందరగోళం, కలహం, అనర్థం అని భయపెట్టిస్తూ ఉంటారు. తెలుగులో నైనా వీరి అక్షరక్రమములు అర్థమవుతాయని ఆశ.

ఇన్ని ప్రయోజనాలున్నందున అర్థ శాస్త్రము, ముఖ్యంగా దేశ పాలసీ విషయాలపై దృష్టిని కేంద్రీకరించిన స్థూల అర్థ శాస్త్రమును తెలుగులోనే అభ్యసించడం అందరికీ మేలు.

అలాగే, కంచెర్లకోట గారు ఒక మాట: కృగ్ మెన్ గారి వాఖ్యలలో జాతి వివిక్షత లేదనే అనుకొని, ఆయన మాట వినక, అచ్చులనూ, గుణింతాలనూ తీయకుండా మీ పేరును మీరే ముందర సరిగ్గా పలకండి చెప్పుతాను. ఆ తరువాత, తెలుగులో ఆలోచిస్తూ, గుణింతాలూ, వొత్తులూ, హల్లులతో కూడి ఐటీ రంగంలో వచ్చినంత విప్లవాన్ని ఆర్థిక ఇంజినీయరింగ్ మళ్ళీ రప్పించి తుఱ్ఱుమందాము!

2010-09-22

బ్లాగు నిర్లక్ష్యమైనది కానీ, నిర్జీవం కాదు

ఎవరూ ఇక్కడ ఏమీ చదవట్లేదనుకున్నా. పొరపాటే! మొననే ఎవరో చదువుతున్నారని చెప్పితేను, సరే మళ్ళీ ఇక్కడే పోస్టు చెయ్యడం పునఃప్రారంభిద్దామని నిశ్చయించుకున్నాను.


కిందటి టపాకీ, ఇప్పటికీ మార్పులు కొన్ని. ఊళ్ళు రెండు సార్లు మారాను, కంపెనీ ఒకసారి, కార్యాలయాలెన్నో సార్లు. వొళ్ళు పెరిగింది, తలపై జుట్టు తగ్గింది. టైం ఇంకాస్త వేగంగా పరుగుతోంది. రేపో మాపో పెళ్లి చేసుకో అంటున్నారు; పెళ్ళి అయ్యే ముందు నాకు పెళ్ళి చేస్తారని అనిపిస్తోంది.


తెలుగు తల్లిపై ప్రేమ, మమకారం తగ్గక, ఇంకా పెరిగినట్టు అనిపిస్తోంది. భాషాశాస్త్ర విషయాలపై మరింత విషయాలూ, విశేషాలతో మీముందు మళ్ళీ వుంటాను.