2013-01-28

పైనాపిల్ అయితే, మరి కిందో?

ఈనాడు వారి మాస పత్రిక తెలుగు వెలుగులో బుఱ్ఱ కథలపై పరిశోధన చేసిన ఫ్రెంచి మానవ విజ్ఞాన శాస్త్ర వేత, తెలుగు వాంగ్మయాన్ని ఫ్రెంచిలోనికి అనువదించనున్న తెలుగు భాషాభిమాని, డా. డేనియల్ నెజ్జర్స్ తో చాలా ఆసక్తికరమైన ఇంటర్వూ ప్రచురించారు. తెలుగు సంస్కృతిపై ఫ్రెంచి ఎకాడిమిక్ దృష్టికోణాన్ని మనం చూడచ్చు. ఇదిగో లంకె.

తెలుగు, ఫ్రెంచి భాషల మూలాల ప్రస్తావనలో డా. నెజ్జర్స్ , ఫ్రెంచి పదాలు palanquin, ananas తెలుగు పదాలైన పల్లకీ, అనాసకాయ నుంచి, జనరల్ ద్యుప్లే ("Dupleix" అన్న ఫ్రెంచి పేరుని ద్యుప్లే అని పలకాలి. పత్రికలో వ్రాసినట్టుగా డ్యూప్లెక్స్ కాదు) కాలంలో వచ్చి వుంటాయి అని అన్నారు.

ఇది సరి కాదు. "Ananas" అన్నది దక్షిణ అమెరికాలోని పరాగ్వే దేశంలో ఎక్కువగా మాట్లాడే గ్వారానీ భాష పదం. ఆ భాషలో "నానస్' అంటే "అద్భుతమైన పండు". పోర్ట్యుగీస్ వారు ఈ పదాన్ని వారి భాష (భాషతో పాటు, వారి వ్యాపారాలు, దండ యాత్రలు, గోవా, మలక్కా వంటి ప్రదేశాలలో వలసరాజ్యస్థాపన)  ద్వారా ప్రపంచమంతా వ్యాపింప చేశారు. ఫ్రెంచే కాదు, జర్మన్, నార్వీజియన్, టర్కిష్ భాషలలో కూడా అదే పదాన్ని వాడుతారు. (స్పానిష్ లో కూడా అననాస్ వాడచ్చు కానీ, ప్రపంచ ప్రజలకు పిణ్యా ("piña") అన్న పదం piña colada అన్న డ్రింకు వల్ల బహుశా ఇంకా ప్రసిద్ధి). ఇటు ఈసాన్యాసియాలో కూడా, మలయ్, బహస ఇండోనీసియాలలో nanas. హిందీ, ఉర్దూలలో अनन्नास (के फल) ("అనన్నాస్ కే ఫల్"). సంస్కృతంలో अनास. తమిళంలో அன்னாசி ("అన్నాచి"). కన్నడలో ಅನಾನಸ್ ಹಣ್ಣು("అనానస హణ్ణు") చిత్తూరు మాండలీకంలో అనారసపండు, కళింగ మాండలీకంలో అన్సా. (ఇకొన్ని మాండలీకాలలో మొగలి పనస అని పిలుస్తారని ఆం.ప్ర సాహిత్య అకేడమీ నిఘంటువులో రాసారని ఆంధ్రభారతీ.కాం లో వేశారు)

ఈ వృత్తాంతం డా నెగ్గర్స్ ని తప్పిపుచ్చడానికి కాదు. నిజానికి, ఆయన మాతృ భాషకీ, పరిశోధనా అంశమైన తెలుగుకి ఇంత ఔత్సాహికంగా లంకెలు ఏర్పరచడం ఆయన  తెలుగు భాషాభిమాననికే నిదర్శనం, ఆ భాషాభిమానం ఎంతో హర్షనీయం. అయినా, అననాస్ అనే పదం ప్రపంచ భాషలెన్నింటిలో ఉందని, ఆయా భాషలు దక్షిణ అమెరికా నుంచి ఆ పదాన్ని దిగుమతి చేసినట్టుగానే, తెలుగు కూడా దిగుమతి చేసిందని చెప్పడం, ప్రపంచ భాషలకు మనమివ్వాల్సిన గౌరవం,  శబ్దవ్యుత్పతికి ("etymology") చూపించాల్సిన వినయం.

కామెంట్‌లు లేవు: