2013-01-27

సముద్రంపై ఎండమావులు - భారత్ కోలిపోయిన దక్షిణాది సరిహద్దు

ప్రపంచంలోనే అతి పెద్ద రేల్వే వ్యవస్థలలో ఒకటైన భారతీయ రేల్వే వ్యవస్థ సముద్ర తీర ప్రాంతానికి మామూలుగా దూరంగానే ఉంటుంది. ఒక్క తిమళ నాడులోని మండపం  పట్టణం దగ్గర తప్ప: అక్కడ సముద్ర తీరానికి  అతి చేరువ అవడమే కాదు, 2.4 కి.మీ వైశాల్యం ఉన్న  పంబన్ వంతెన మీదుగా సముద్ర జలాసంధిని దాటి, ఇంకో 12 కిలోమీటర్ల పయనించి, ప్రముఖ పుణ్యక్షేత్రమైన రామేశ్వరం(యూ ట్యూబ్ వీడియో) నగరం మధ్యలో,  రామనాథ గుడి ప్రాంగణానికి దగ్గరి వరకూ వెళ్ళుతుంది.

రామేశ్వరం పట్టణం నుంచి ఇంకో 20 కిలోమీటర్లు వెళ్ళగా మనం మూనంచరితం అని పిలువబడే కుగ్రామానికి చెరుతాం. టార్ రోడ్డు అక్కడితో అంతమవుతుంది. ఆటోలు, జీపులు చేసి సముద్ర తీరం వెంబడే ఇంకో ఏడు కిలోమీటర్లు వెళ్ళితే మనకి కనబడేవి పాడుబడిన భవంతులు, ఇసుకతో కలిసిపోయిన పట్టాలు, ఓ మునిగి పోయిన దేవాలయం, సిధిలావస్తలో వున్న చర్చి. ఇదే ధనుష్ కోడి(యూ ట్యూబ్ వీడియో) పట్టణం. డిసెంబరు 23, 1964 వరకూ, ఇది దక్షిణాదిలో భారత దేశపు ఏకైక సరిహద్దు.

అంతర్జాతీయ చట్టం ప్రకారం భారత్ యొక్క దేశాధికారపరిధి సముద్రపు ఒడ్డు నుంచి 22 కి.మీ. దూరం వరకూ వ్యాపిస్తుంది. అంటే, భారతదేశము, శ్రీ లంకల సరిహద్దు ఈ ఉపగ్రహ చిత్రంలో చూపింపబడ్డ దీవుల్ల మధ్యలో ఎక్కడో పడుతుంది. ఈ సన్నరాతి దీప శ్రేణినే ఆంగ్లేయులు  ఏడంస్ వంతెన అని, తమిళేయులు రామర్ పాలం (అనగా రాముని సేతువు) అని పిలుస్తారు. రామాయణంలో లంకకు వానర సైన్యము సహాయముతో కట్టిన వారధి ఇదే అని కొందరి వాదన. రామాయణములోని లంక ప్రస్తుతం ఒడిషా సమీపంలో ఉండేదని మరి (కొందరి వాదన. కాదు, బంగాళాఖాతానికి అవతలి వైపులో ఉన్న మలయా ద్వీపకల్పములో ఉండేదని మరికొందరి వాదన).

ఆధ్యాత్మిక వాదనలు ఎలా ఉన్నా, కనీసం క్రీ.శ. 14వ శతాబ్దం వరకూ పాక్ జలాసంధికి ఇవతిలి వైపైన ధనుష్ కోడి, అటువైపు అయిన తలైమున్నార్ మధ్యలో నడవగలిగేట్టుగా ఉండేదని మనకి చారిత్రాత్మక ఆధరాలు ఉన్నాయి. ఆధునిక యుగంలో ఆ ప్రాంతము సేతువుగా కాక పాక్ జలాసంధిగా మిగిలిపోయింది, ప్రయాణీకుల సౌకర్యార్ధం ఆ జలాసంధిపై ఫెర్ఱీలు కూడా నడిచేవి. అప్పటి మద్రాసు నగరం నుంచి శ్రీ లంక రాజధాని అయిన కొలాంబో వరకూ రైలులో వేళ్ళగలిగే వారు. ఎగ్మోర్ స్టేషను నుంచి బోట్ మేయిల్ రైలు తీసుకొని, ధనుష్ కోడిలో జెట్టీని ఆనుకున్న రైలు స్టేషనులో దిగి, నావ తీసుకొని, ముప్పై కి.మీ. దూరంలో ఉన్న తలై మున్నార్ చేరి, కొలాంబో వరకూ ఇంకో రైలు తీసుకొనే వారు. ప్రపంచ సర్వ మత సమావేశాలలో పాల్గొనేందుకు వెళ్ళి విదేశాలను పర్యటించి తిరిగి వస్తున్న స్వామి వివేకానంద కొలాంబో వరకూ నావలో వచ్చి, అక్కడి నుంచి ఈ రైలు తీసుకొనే భారత దేశానికి తిరిగి వచ్చారు. అప్పటిలో ధనుష్ కోడి ఎంతో ప్రాముఖ్యం గల నగరం; భారత దేశపు 11వ రాష్ట్ర పతి డా. ఏ.పీ.జే. అబ్దుల్ కలాం, ఇక్కడే ఓ మధ్య తరగతి కుటుంబానికి జన్మించారు.

తుపానులు బంగాళాఖాతానికి సర్వ సాధారణమైనా, డిసెంబరు నెలలో అరుదు, భూమధ్య రేఖకు 5 డిగ్రీలు ఉత్తరాన తుఫానులు అంతకంటే అరుదు. పరిస్తుతులు ఎంత అరుదైనా, 18 డిసెంబరు 1964 కల్లా అండామాన్ దీవులకు దగ్గరలో అల్పపీడనం అవతరించి, వాయుగుండంగా మారి, గంటకి 150 నాటుల వేగంతో పాక్ జలాసంధి వైపు పరుగులు తీసింది. డిసెంబరు 22 1964 రాత్రికి తీరాన్ని దాటి, 8 యార్డుల ఎత్తున్న అలలను సృష్టించింది. ఆ అలలోనే అప్పుడే బయలు దేరిన బోట్ మేయిల్ రైలు కొట్టుకు పోయింది. ఎందరో మరణించారు. ధనుష్ కోడి ఊరే కొట్టుకు పోయినట్టు అయినది, కొన్ని రోజులకి ఆ పట్టణాన్ని ప్రభుత్వం నిర్జీవ నగరంగా ప్రకటించి, ప్రకృతి వైపరిత్యాలకు వదిలివేసింది.

కాలక్రమేణా, శ్రీ లంకలో కూడా జాతి సంబంధిత అల్లర్లు మొదలై అంతర్యుద్ధంగా మారింది. ఇందులో భారత్ ప్రమేయం కూడా ఉన్న మాట విదితమే. ఇరుపక్కలా రాజకీయ పరిస్తుతులు విషమించడంతో సరిహద్దు మూయబడింది.

ముప్పై యేళ్ళ అంతర్యుద్ధం ఇక అంతమించడంతో ఇరువైపులా రోడ్డు రైలు పునః నిర్మాణం చేయలన ప్రతిపాదనలు వస్తున్నాయి. ట్యూటికారిన్ నుంచి కొలాంబో వరకూ ఓడలు నడుస్తున్నాయి; అలాగే రామేశ్వరం నుంచి తలైమున్నార్ వరకూ ఓడలు వేయలన్న ప్రతిపాదన ఉన్నది. పాక్ జలాసంధిని ఇంకా లోతు పరచి, నౌకా మార్గము ఏర్పర్చాలన్న ప్రతిపాదన కూడా ఉన్నది, ఆ ప్రతిపాదనకు జీవావరణ, మతత్వ, సామాజిక అభ్యంతరాలు ఉన్నాయి, ఆ అభ్యంతరాలకు ప్రత్యుత్తరాలు కూడా ఉన్నాయి. ఇరు దేశాల రవాణా వ్యవస్థలను లంకెంచడానికి రాజకీయ ప్రతికూలత ఉండనే ఉన్నది.

చెరిత్రపుటలలోనే ఇక మిగిలిన ధనుష్ కోడి నగరం పునః జీవనం చెందుతుందో తెలియదు.

కామెంట్‌లు లేవు: