2010-10-14

తెలుగు వల్లభుండా, ఆంధ్ర భోజను

సాహితీ పరులకు ఈ విషయాలు ముందరే తెలిసుండచ్చు, మెట్టు మెట్టు వాంగ్మయ వీధుల్లో విస్మయముతో విహరిస్తున్న ఈ విద్యార్థి విశ్లేషించడాన్ని మన్నించి తప్పొప్పులు సూచించాలని మనవి.

ఏదో సందర్భంలో దేశభాషలందు తెలుగు లెస్స అన్న నినాదం ఎలా వచ్చింది, ఆ మూల పద్యానికి అర్థమేమి అని నన్ను ఎవరో అడిగారు. బ్లాగు లోకంలో పలు చోట్ల చెప్పారు, మరి వారికి నేనిచ్చిన సమాధానమిది:-

ఆసక్తితో అడిగినందుకు కృతజ్ఞతాభివందనములు. ఈ పద్యం భావయుక్తమే కాదు, చారిత్రాత్మకమైనది కూడా. దాని తాత్పర్యమిది (కాస్త స్వేచ్చానువాదం)

తెలుగు భాష యేలు దేశంబు తెలుగు
తెలుగు వల్లభుండను, తెలుగు(వారి)లో ఒకండును.
ఎల్ల నృపులు నన్ను కొలిచి భాషింతురు
తెలుసుకో: దేశ భాషలందు తెలుగు లెస్స

ఇందులోని ఇతిహాసం కాస్త విశ్లేషించాలి, పద్యములోని పూర్తి సారాంశము అర్థమయ్యేటందుకు.

ఆంధ్రభోజ అని బిరుదాంకితుడైన శ్రీ కృష్ణదేవరాయల వారు తుళువ వంశీయులు; వీరి జన్మస్థలము కర్ణాటకకు పశ్చిమానున్న తుళూ దేశము. ఎంతో ఆర్థిక బలం, సైన బలం వున్న విజయనగర సామ్రాజ్యాన్ని విస్తీర్ణించుటకు రాయలవారు 30,000 కాల్బలములు, నాలుగు వేల అశ్విక దళము, రెండువందల ఏనుగులతో కూడిన సైన్యముతో తూర్పు దేశ దండ యాత్రను తలపెట్టారు.

ఆ దండ యాత్రలో భాగంగా ఒకానొక రాత్రి కృష్ణా తీరాన శ్రీకాకులం అనే ఊరి దెగ్గర బసచేసిరి. ఈ శ్రీకాకుళం విశాఖపట్టణం దాటాక వచ్చే ఉత్తరాంధ్ర నగరం కాదు, కృష్ణా జిల్లా, ఘంటసాల మండలంలో కృష్ణవేణి ఒడ్డున ఉన్న కుగ్రామం. శ్రీకాకులంలో విష్ణుమూర్తి ఆంధ్ర మహావిష్ణువుగా వెలసారని ప్రసిధ్ధి. ఇది అతి పురాతనమైన గుడి; క్రీ.పూ 3వ శతాబ్దం (నాటిదని శిలాశాసనాలు, ఇత్యాది ఆధారాలు చెప్పుతున్నాయి.

అలాంటి ఈ ఆంధ్ర మహావిష్ణువు గుడి ఒడిలో బసచేస్తున్న తుళూ దేశస్తుడైన శ్రీ కృష్ణదేవరాయలవారి స్వప్నంలో ఆంధ్ర మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి, ఇలా అన్నారట:

ఉ. ఎన్నిను గూర్తునన్న వినుమేమును దాల్చినమాల్య మిచ్చున
ప్పిన్నది రంగంమం దయిన పెండిలి సెప్పుము మున్ను గొంటి నే
వన్నన దండ యొక్క మగవాడిడ నేను దెలుంగు రాయడన్
గన్నడ రాయ యక్కొదువ గప్పు ప్రియా పరిభుక్త భాక్కథన్.

అంటే:

నా గాధలు ఎన్నో వినవచ్చును, పూలమాల ఇచ్చి తను డాల్చిన
భక్తుని శ్రీ రంగములో పెండ్లాడినాను. స్త్రీలూ, పురుషులూ
మాలలతో హారములతో పూజింతు తెలుగు రాయుడనను నేను.
ఓ కన్నడ రాయ, నా కథను నేవే భక్తితో చెప్పవలెను.

మరి తూళూ, సంస్కృతం, కన్నడ, తెలుగు భాషలలో ప్రావీణ్యమున్న శ్రీ కృష్ణ దేవరాయలు ఏ భాషలో ఆ గాధను వన్నించవలెను? అందుకా ఆంధ్ర మహా విష్ణువు ఇలా అన్నారట:-

ఆ. తెలుగదేల యన్న దేశంబు తెలు గేను
దెలుగు వల్లభుండ దెలుగొకండ
యెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి
దేశభాషలందు దెలుగు లెస్స

బాసిల్లు అంటే భాషించు అంటే భాషణము చేయు, అంటే భాషను మాట్లాడు. తెలుగు భూమినేలడానికి వచ్చిన రాయలవారు తెలుగు వారై తెలుగునే ఎలా ఏల గలిగారన్న ప్రశ్నకు ఇది నిదిర్శనం.

ఎందుకంటే, వారి భావాన్నిలా కూడా వర్ణించచ్చు: మాట్లాడేది తెలుగు, మాట్లాడే ప్రదేశము తెలుగు, మోక్షమిచ్చేది (దైవమని పూజించేది) తెలుగు, మాట్లాడే వారు తెలుగు. తెలుసుకో: దేశ భాషలందు తెలుగు లెస్స.

7 కామెంట్‌లు:

yudy చెప్పారు...

భళా పోతరాజు ! భళా !

Unknown చెప్పారు...

ee bhagothamantha ekkadi nunchi sekarinchavu babu

కొత్త పాళీ చెప్పారు...

well done.

The Cydonian చెప్పారు...

కొత్త పాళీ గారు: మీ వ్యాఖ్య చదివి పరమానంద కలిగింది. కారణం: టపాలో సూచించిన సాహితీ పరులు మీ పోటి వాళ్ళే! :)

abhinay: ఇది భాగవతం కాదు, శ్రీ కృష్ణదేవరాయలవారిచే విరచితమైన ఆముక్తమాల్యద. మూలాల అనేకం; పద్యం ఎప్పటి నుంచో పరిచయం. భావాన్ని పునః పటన చేసేందుకు కాస్త గూగిలించాను; అందిన ఫలితాలలో కొత్త పాళీ గారి అద్భుత ఆంగ్లానువాదం. ఆ భావాన్ని చదివింతరువాత పద్యములోని మెలుకువ, మాధుర్యము, దాని వెనకనున్న చారిత్రాత్మక విశేషాలను చదివి ఊహించి ఆలోచించగా, నాలోనే ఆ ఉత్సహాన్ని ప్టట్టలేక, ఇదిగో గద్యరూపంలో రాశాను. :)

yudy: మీ దీవెనలకు కృతజ్ఞతలు! :)

Hemalatha చెప్పారు...

interesting...

Unknown చెప్పారు...

అద్భుతoగా ఉoది

Madhu Latha చెప్పారు...

తెలుగు అభివృధికై ఈ వెబ్ సైటు
www.teluguvaramandi.net