దిదిద్ధిమినకపోతరాజు
గాన భావమున జీర్ణమయ్యె సుభాషితంబు.
2013-02-04
మామ్మ బ్లాగు, బంగారు బాట
2013-01-28
BRIC అభివద్ధి కథనంపై ఇటుకలు
“There is probably no other example in the history of world development of an economy growing so fast for so long with such limited results in terms of broad-based social progress.” Sen and Drèze were referring to the fact that for about 32 years now (since 1980), India has averaged annual GDP growth rates of approximately six per cent — whereas, the nation’s ranking in terms of the Human Development Index has remained unchanged over that period: we were ranked an abysmal 134 in 1980, we were ranked exactly that in 2011.
(తెలుగులో) "ఇంత త్వరగా ఆర్థికాభివృద్ధి చెంది, ఇంత తక్కువ సామాజిక ప్రగతిని సాంధించిన ఆర్థికవ్యవస్థ ప్రపంచ చరిత్రలోనే ఇంకేదీ లేదమో", అన్నది అమర్త్యా సేన్, డ్రేజ్ లల వాదన. దానికి కారణం: 1980 నుంచి 2011 వరకూ, భారత దేశం సగటున 6 శాతం ఆర్థికాభివృద్ధి పెరుగుదల చూపింపించినా, దేశపు మానవాభివృద్ధి సూచిక ప్రకారం ఏమాత్రం పెరుగుదల లేదు.ఆలోచనాత్మక వ్యాసం.
పైనాపిల్ అయితే, మరి కిందో?
తెలుగు, ఫ్రెంచి భాషల మూలాల ప్రస్తావనలో డా. నెజ్జర్స్ , ఫ్రెంచి పదాలు palanquin, ananas తెలుగు పదాలైన పల్లకీ, అనాసకాయ నుంచి, జనరల్ ద్యుప్లే ("Dupleix" అన్న ఫ్రెంచి పేరుని ద్యుప్లే అని పలకాలి. పత్రికలో వ్రాసినట్టుగా డ్యూప్లెక్స్ కాదు) కాలంలో వచ్చి వుంటాయి అని అన్నారు.
ఇది సరి కాదు. "Ananas" అన్నది దక్షిణ అమెరికాలోని పరాగ్వే దేశంలో ఎక్కువగా మాట్లాడే గ్వారానీ భాష పదం. ఆ భాషలో "నానస్' అంటే "అద్భుతమైన పండు". పోర్ట్యుగీస్ వారు ఈ పదాన్ని వారి భాష (భాషతో పాటు, వారి వ్యాపారాలు, దండ యాత్రలు, గోవా, మలక్కా వంటి ప్రదేశాలలో వలసరాజ్యస్థాపన) ద్వారా ప్రపంచమంతా వ్యాపింప చేశారు. ఫ్రెంచే కాదు, జర్మన్, నార్వీజియన్, టర్కిష్ భాషలలో కూడా అదే పదాన్ని వాడుతారు. (స్పానిష్ లో కూడా అననాస్ వాడచ్చు కానీ, ప్రపంచ ప్రజలకు పిణ్యా ("piña") అన్న పదం piña colada అన్న డ్రింకు వల్ల బహుశా ఇంకా ప్రసిద్ధి). ఇటు ఈసాన్యాసియాలో కూడా, మలయ్, బహస ఇండోనీసియాలలో nanas. హిందీ, ఉర్దూలలో अनन्नास (के फल) ("అనన్నాస్ కే ఫల్"). సంస్కృతంలో अनास. తమిళంలో அன்னாசி ("అన్నాచి"). కన్నడలో ಅನಾನಸ್ ಹಣ್ಣು("అనానస హణ్ణు") చిత్తూరు మాండలీకంలో అనారసపండు, కళింగ మాండలీకంలో అన్సా. (ఇకొన్ని మాండలీకాలలో మొగలి పనస అని పిలుస్తారని ఆం.ప్ర సాహిత్య అకేడమీ నిఘంటువులో రాసారని ఆంధ్రభారతీ.కాం లో వేశారు)
ఈ వృత్తాంతం డా నెగ్గర్స్ ని తప్పిపుచ్చడానికి కాదు. నిజానికి, ఆయన మాతృ భాషకీ, పరిశోధనా అంశమైన తెలుగుకి ఇంత ఔత్సాహికంగా లంకెలు ఏర్పరచడం ఆయన తెలుగు భాషాభిమాననికే నిదర్శనం, ఆ భాషాభిమానం ఎంతో హర్షనీయం. అయినా, అననాస్ అనే పదం ప్రపంచ భాషలెన్నింటిలో ఉందని, ఆయా భాషలు దక్షిణ అమెరికా నుంచి ఆ పదాన్ని దిగుమతి చేసినట్టుగానే, తెలుగు కూడా దిగుమతి చేసిందని చెప్పడం, ప్రపంచ భాషలకు మనమివ్వాల్సిన గౌరవం, శబ్దవ్యుత్పతికి ("etymology") చూపించాల్సిన వినయం.
గర్జించు రష్యా, గాండ్రించు రష్యా!
ఒక్క రష్యా మనహా. దేశాల వారీగా చూస్తే, ఇండియా, అమెరికాల తరువాత రష్యా పాఠకులు మూడో స్థానంలో ఉన్నారు. అక్కడ ఎక్కువ సంఖ్యలో ప్రవాసాంధ్రులు లేరన్నదే నా అభిప్రాయం. అంటే, ఈ పాఠకులంతా రష్యా జాతీయులే. రష్యా వారికి తెలుగుపై ఆసక్తి ఉన్నదనే అంశము విదితమే; ఇంగ్లీషు కాని ఓ అంతర్జాతీయ భాష నేర్చుకోవలని నేను ఎప్పుడో మా తాతగారికి చెప్పితే, ఆయన ఢిల్లీలోని పాలికా బజార్ అంతా వెతికి, నాకు ఓ తెలుగు-రష్యన్ నిఘంటువు సెకెండ్ హ్యాండ్ లో కొని బహుకరించారు. అది రష్యన్-తెలుగు నిఘంటువు కాక తెలుగు-రష్యన్ నిఘంటువు అవడం చేత (అంటే, తెలుగు పదాలకు రష్యన్ అర్థాలు), నాకు ఎక్కువ ఉపయోగకరం అవ్వలేదు. అది వేరే విషయంలేండి.
ఏది ఏమైనా, రష్యన్ పాఠకులందరికీ హృదయ పూర్వకమైన привет! ("ప్రివెట్"; రష్యన్లో "హెలో") నాకు అంతకంటే రష్యన్ రాదు. మా ఆవిడకి ఇంకాస్త రష్యన్ - ఓ వాక్యం - తెలుసు, అయితే, ఆ పదాలకు నా నోరు తిరుగదు. పలకగలిగినా ఇక్కడ ఎక్కువ ప్రయోజనం లేదు, ఎందుకంటే ఆ వాక్యానికి అర్థం, "క్రెంలిన్ కి ఏ మెట్రో లైన్ తీసుకోవాలి" అన్నది. తెలుగు బ్లాగింగ్ పై మీకున్న ఆసక్తికి జోహారు! ఏదైనా అర్థం కాకపోతే గూగుల్ ట్రాన్స్ లేట్ వాడండి. నకిలీ మందులు, సాఫ్ట్ వేర్ కొనుగోలు, స్విస్ బ్యాంకులలో నిలిచిపోయిన ఆఫ్రికా బ్లాక్ మనీని స్వేతపరచడం వంటి ప్రతిపాదనలుంటే తప్పకుండా వేగు పంపండి!
2013-01-27
సముద్రంపై ఎండమావులు - భారత్ కోలిపోయిన దక్షిణాది సరిహద్దు
రామేశ్వరం పట్టణం నుంచి ఇంకో 20 కిలోమీటర్లు వెళ్ళగా మనం మూనంచరితం అని పిలువబడే కుగ్రామానికి చెరుతాం. టార్ రోడ్డు అక్కడితో అంతమవుతుంది. ఆటోలు, జీపులు చేసి సముద్ర తీరం వెంబడే ఇంకో ఏడు కిలోమీటర్లు వెళ్ళితే మనకి కనబడేవి పాడుబడిన భవంతులు, ఇసుకతో కలిసిపోయిన పట్టాలు, ఓ మునిగి పోయిన దేవాలయం, సిధిలావస్తలో వున్న చర్చి. ఇదే ధనుష్ కోడి(యూ ట్యూబ్ వీడియో) పట్టణం. డిసెంబరు 23, 1964 వరకూ, ఇది దక్షిణాదిలో భారత దేశపు ఏకైక సరిహద్దు.
2010-10-14
తెలుగు వల్లభుండా, ఆంధ్ర భోజను
సాహితీ పరులకు ఈ విషయాలు ముందరే తెలిసుండచ్చు, మెట్టు మెట్టు వాంగ్మయ వీధుల్లో విస్మయముతో విహరిస్తున్న ఈ విద్యార్థి విశ్లేషించడాన్ని మన్నించి తప్పొప్పులు సూచించాలని మనవి.
ఏదో సందర్భంలో దేశభాషలందు తెలుగు లెస్స అన్న నినాదం ఎలా వచ్చింది, ఆ మూల పద్యానికి అర్థమేమి అని నన్ను ఎవరో అడిగారు. బ్లాగు లోకంలో పలు చోట్ల చెప్పారు, మరి వారికి నేనిచ్చిన సమాధానమిది:-
ఆసక్తితో అడిగినందుకు కృతజ్ఞతాభివందనములు. ఈ పద్యం భావయుక్తమే కాదు, చారిత్రాత్మకమైనది కూడా. దాని తాత్పర్యమిది (కాస్త స్వేచ్చానువాదం)
తెలుగు భాష యేలు దేశంబు తెలుగు
తెలుగు వల్లభుండను, తెలుగు(వారి)లో ఒకండును.
ఎల్ల నృపులు నన్ను కొలిచి భాషింతురు
తెలుసుకో: దేశ భాషలందు తెలుగు లెస్స
ఇందులోని ఇతిహాసం కాస్త విశ్లేషించాలి, పద్యములోని పూర్తి సారాంశము అర్థమయ్యేటందుకు.
ఆంధ్రభోజ అని బిరుదాంకితుడైన శ్రీ కృష్ణదేవరాయల వారు తుళువ వంశీయులు; వీరి జన్మస్థలము కర్ణాటకకు పశ్చిమానున్న తుళూ దేశము. ఎంతో ఆర్థిక బలం, సైన బలం వున్న విజయనగర సామ్రాజ్యాన్ని విస్తీర్ణించుటకు రాయలవారు 30,000 కాల్బలములు, నాలుగు వేల అశ్విక దళము, రెండువందల ఏనుగులతో కూడిన సైన్యముతో తూర్పు దేశ దండ యాత్రను తలపెట్టారు.
ఆ దండ యాత్రలో భాగంగా ఒకానొక రాత్రి కృష్ణా తీరాన శ్రీకాకులం అనే ఊరి దెగ్గర బసచేసిరి. ఈ శ్రీకాకుళం విశాఖపట్టణం దాటాక వచ్చే ఉత్తరాంధ్ర నగరం కాదు, కృష్ణా జిల్లా, ఘంటసాల మండలంలో కృష్ణవేణి ఒడ్డున ఉన్న కుగ్రామం. శ్రీకాకులంలో విష్ణుమూర్తి ఆంధ్ర మహావిష్ణువుగా వెలసారని ప్రసిధ్ధి. ఇది అతి పురాతనమైన గుడి; క్రీ.పూ 3వ శతాబ్దం (నాటిదని శిలాశాసనాలు, ఇత్యాది ఆధారాలు చెప్పుతున్నాయి.
అలాంటి ఈ ఆంధ్ర మహావిష్ణువు గుడి ఒడిలో బసచేస్తున్న తుళూ దేశస్తుడైన శ్రీ కృష్ణదేవరాయలవారి స్వప్నంలో ఆంధ్ర మహావిష్ణువు ప్రత్యక్షమయ్యి, ఇలా అన్నారట:
ఉ. ఎన్నిను గూర్తునన్న వినుమేమును దాల్చినమాల్య మిచ్చున
ప్పిన్నది రంగంమం దయిన పెండిలి సెప్పుము మున్ను గొంటి నే
వన్నన దండ యొక్క మగవాడిడ నేను దెలుంగు రాయడన్
గన్నడ రాయ యక్కొదువ గప్పు ప్రియా పరిభుక్త భాక్కథన్.
అంటే:
నా గాధలు ఎన్నో వినవచ్చును, పూలమాల ఇచ్చి తను డాల్చిన
భక్తుని శ్రీ రంగములో పెండ్లాడినాను. స్త్రీలూ, పురుషులూ
మాలలతో హారములతో పూజింతు తెలుగు రాయుడనను నేను.
ఓ కన్నడ రాయ, నా కథను నేవే భక్తితో చెప్పవలెను.
మరి తూళూ, సంస్కృతం, కన్నడ, తెలుగు భాషలలో ప్రావీణ్యమున్న శ్రీ కృష్ణ దేవరాయలు ఏ భాషలో ఆ గాధను వన్నించవలెను? అందుకా ఆంధ్ర మహా విష్ణువు ఇలా అన్నారట:-
ఆ. తెలుగదేల యన్న దేశంబు తెలు గేను
దెలుగు వల్లభుండ దెలుగొకండ
యెల్ల నృపులు గొలువ నెరుగవే బాసాడి
దేశభాషలందు దెలుగు లెస్స
బాసిల్లు అంటే భాషించు అంటే భాషణము చేయు, అంటే భాషను మాట్లాడు. తెలుగు భూమినేలడానికి వచ్చిన రాయలవారు తెలుగు వారై తెలుగునే ఎలా ఏల గలిగారన్న ప్రశ్నకు ఇది నిదిర్శనం.
ఎందుకంటే, వారి భావాన్నిలా కూడా వర్ణించచ్చు: మాట్లాడేది తెలుగు, మాట్లాడే ప్రదేశము తెలుగు, మోక్షమిచ్చేది (దైవమని పూజించేది) తెలుగు, మాట్లాడే వారు తెలుగు. తెలుసుకో: దేశ భాషలందు తెలుగు లెస్స.
2010-09-27
స్థూల అర్థ శాస్త్రము అభ్యసించుటకు తెలుగే మేలు
నాకు శిక్షణ వున్నది కంప్యూటర్లలో. అభిరుచులున్నవి భాషా శాస్త్రము, ఇతిహాసములలో. ఆసక్తి వున్నది వాంగ్మయంపై. అసలు అర్థంకానిది, అర్థ శాస్త్రము; ఒక్కో సారి గణాంకాలు ప్రథానంగానూ, మరి కొన్ని సార్లు గుణాత్మకంగానూ నడిచే ఈ శాస్త్రములోని వాదసరళి కాస్త వైవిధ్యముగా, పలకలేకలేని సాంకేతిక పదాలతో అనూహ్యరీతిలో పరుగులు తీస్తుంది. ఆర్థిక శాస్త్రమనే నగరంలో విహరించుటకు మీకు తెలుగు మ్యాప్ వుండడమే మేలన్నది నా వాదన.
ఇలా అనడానికి ప్రథమ కారణం, అర్థంకాక పలకలేని పదాలుండడం. యేటేటా ఆర్థిక శాస్త్రములో ఇచ్చే నొబేల్ బహుమతి గురించి వినే వుంటారు; 1998లో దశాబ్దాల బట్టీ విదేశాలలో వుంటున్నా ఇంకా భారతీయ పాస్పోర్ట్ వుంచుకున్న ఒక మేధావికి ఆ బహుమతి ఇచ్చారు. ఆ బహుమతి నొబేల్ ఫౌండేషన్ వారిచ్చేది కాదు కాబట్టి, నిజ నొబేల్ బహుమతిగా పరిగణించకోడదు, ‘అల్ఫ్రెడ్ నొబేల్ జ్ఞాపకార్థం ఆర్థిక శాస్త్రములో స్వెరిజెస్ రిక్స్ బే్ంక్ వారి బహుమతి’ అని పిలవాలన్నది కొందరి వాదన. ఈ వాదన తప్పో, ఒప్పో నాకు తెలియదు కానీ, పదాలను దీక్షగా చూడండి: ఈ బహుమతి ఇస్తున్న వారి పేరు రోమన్ లిపిలో Sveriges Riksbank. తిలకించండి: Sveriges. తెలుగులో ముందర చదవకుంటే మీకది స్వెరిగస్ ఓ, స్వెర్గ్ స్ యో, స్వెరిజెస్ ఓ తెలియదు. నేను స్వెరిజస్ అని పిలుస్తున్నాను కాబట్టి మీ మదిలో కూడా ఈ పదము యొక్క ఉచ్చారణ ఇలా అతుక్కుపోయింది. చూశారా, తెలుగు లిపిలోని గొప్ప తనం.
సరే , తెలుగులో పిలవడానికి సులభమయ్యింది కానీ, ఈ ఉచ్చారణా సౌలభ్యము ఏ కఠిన పదాలకైనా వర్తిస్తుంది కదా, ప్రత్యేకించి స్థూల అర్థ శాస్త్రానికే వర్తించేది ఏమున్నది అని మీరు అడగచ్చు. మరీనకునేది సబబే. అది అర్థం కావాలంటే, ఆ స్వె.రి. బహుమతినే, ఇంకో పదేళ్ళ తరువాత, అంటే, 2008లో, గెలుచుకున్న వారి వాఖ్యలను మీరు తిలకించాలి. ప్రస్తుక ఆర్థిక మాంధ్యం (క్షమించండి, అమెరికాలో మాంధ్యం 15 నెలల కిందటే నశించింది) ఆర్థిక దురోగతి / ఖబుర్లను విశ్లేషించడానికి డా. పోల్ కృగ్ మెన్ గారి పుస్తకాలూ, వ్యాసాలు, బ్లాగు ఎంతగానో సహకరిస్తాయి. ఆయన ఇవ్వాళ్ళన్న మాటలివి:
నారాయణ కోచెర్లకోటతో నాకున్న ఇబ్బంది: ఆయనకు తన పేర్లో మరీ ఎక్కువ అక్షరామూర్తులున్నాయి! అంటే, మిత్రులారా, మామూలు శీర్షిక నిమిత్తమైన చోటులు పట్టాలి – మినియాపోలీస్ సంయుక్త రిజర్వ్ బ్యాంకు అధినేతను ప్రస్తావించనప్పుడల్లా అరుదైన పత్రికా భూస్థితి కోల్పోతునాను.
నాకో కొత్త నియమం కావాలి – పాలసీ చర్చలో పాల్గొనే వాళ్ళకంతా న్గ్, లేదా ఇప్ లాంటి పేర్లే వుండాలి. నన్ను మీరు క్న్ అని పిలవచ్చు.
పోనీ, [అందరి పేర్లలోనుంచి] అచ్చులను తొలగిద్దామా?
క్న్ అని పలకడం అందరికీ సులభమయినా, తరతరాల నుంచి వస్తున్న ఆష్కెన్ నాట్సీ వారసత్వమును వీడి, అంతరిస్తున్న యిడ్డిష్ భాషలో ఉన్న పోల్ గారి ఇంటి పేరును తీసివేయడం నాకంత ఆమోదకప్రాయంగా కనబడుటలేదు. పైపిచ్చు - అంటే ఇది ఎన్నంటికీ అవలేదనుకోండి - కానీ, ఒక వేళ ఆయన ఏవో తప్పులు పలికితే కృగ్ మెన్ ఖంగు తిని కృంగిపోయాడు అనే వార్తా శీర్షికను మనం రాయలేము. అంత కంటే సులభ మార్గము కృగ్ మెన్ గారికి ప్రస్తావిద్దాం:- స్థూల అర్థ శాస్త్ర చెర్చలన్నీ తెలుగులోనే కొనసాగించండి! ఈ ప్రదిపాదనతో మీకు చాలా లాభాలు:
1) శాస్త్రవెత్తల పేర్లు సులభంగా పట్టికలో పట్టుతాయి
పోల్ కృగ్ మెన్ పేరే చూడండి, ఆంగ్లములో పేరు, ఇంటి పేరు 4 + 7 అక్షరాలైతే తెలుగులో 2 + 2 అక్షరాలయ్యాయి. అలాగే, కోచెర్లకోట గారి పేరు కేవలం 4 + 4 అక్షరాలతోనే కానివచ్చు. చాలా ఖరీదైన పత్రికా భూస్తితిని పొదుపు చేసుకోవచ్చు.
2) తూర్పాసియా దేశాలతో పోటీ పడచ్చు
అంతే కాదు, మీరెవ్వరూ ఊహించని ఇంకో లాభాంశము ఇంకొకటి వుంది. అధికాదాయంతో, వాణిజ్య రంగంలోనూ, ఉపనిర్మాణలలోనూ చైనా, దక్షిణ కొరియా వంటి తూర్పాశియా దేశాలు, మనకీ, పాస్చాత్య దేశాలకీ ఎంతగా పోటీ ఇస్తున్నాయో మీకే తెలుసు. ఇక పత్రికా భూస్తితి విషయంలో కూడా తక్కువ శబ్దగుణలతో ఎంతగా వారు ముందున్నారో మీరే చూడండి. చైనా అధినేత పేరు Hu Jintao. ఇంటి పేరు కేవలం రెండు రోమన్ అక్షరాలు. కానీ, తెలుగు లిపి వాడుకతో ఈ సుప్రయోజనం చాలా మడుకూ తగ్గకలదు. చైనాలో నూతన ఆర్థిక విధానాలను ప్రవేశ పెట్టిన డెంగ్ సియావుపింగ్ గారి విషయమే చూడండి. రోమన్ లిపిలో అక్షరాల సంఖ్యకూ, తెలుగు లిపిలో అక్షరాల సంఖ్యకూ అంత తేడా లేదని మీరు అనుకోవచ్చు.అయితే, పాస్చాయితీలూ, భారతీయుల పేర్లలో తగ్గింపు వుంటుంది కాబట్టి స్వాభివకంగా చిన్నవైన తూర్పాసియా దేశస్తుల పేర్లను తెలుగులోకి దిగుమతి చేయడం వల్ల వారికున్న లాభాన్ని మనం ఇంచుమించు పోగొట్ట గలము.
3) పేర్లు సులభంగా పలకచ్చు
పేర్లను సులభంగా రాయడమే కాదు, సులభంగా ఉచ్చరించచ్చు కూడా. స్వెరిజెస్ కానివ్వండీ, కృగ్ మెన్ కానివ్వండి, నస్సీం నిఖోలాస్ తాలెబ్ (ఈయన పేరు రోమన్ లిపిలో ఇంకోలా చదివారు కదూ!) కానివ్వండి, నోరియల్ రౌబీనీ కానివ్వండీ, జేకబ్ బ్రోఖ్నర్ మేడ్సెన్ కానివ్వండి, చివరికి నారాయణ కంచుకోట గారే కానివ్వండి, అందరి పేర్లను సులభంగా పలకాలంటే తెలుగులోనే రాయడం మేలు.
4) తెలుగు మాట్లాడగలిగిన ఆర్థిక శాస్త్రవేత్తలు
అంతర్జాతీయంగానే కాదు, జాతీయంగా కూడా ఆర్థికంశాలను తెలుగులోనే పరిగణించడం సబబు. ఇండియోలో సరళీకృత ఆర్థిక విధానలను ప్రవేశపెట్టినప్పటి నుండీ ఇప్పటికి వరకూ, ఒక్క బిమల్ జలాన్ గారు మినహా, భారతీయ రిజర్వ్ బేంక్ యొక్క గవర్నర్లందరూ తెలుగు మాట్లాడే వారే. ఈ సరళీకృత విధానలను ప్రవేశ పెట్టిందీ తెలుగోడి హయాములోనే. అంటే, దేశంలో ఇంత ఆర్థిక పెరుగుదల రావడానికి కారణం తెలుగులో ఆలోచించడమే! ఈ విజయం ఆర్థిక సమస్యలతో ఇంకా బాధపడుతున్న ఇతర దేశస్తులతో పంచుకోవడం మన నైతిక బాధ్యత.
5) అర్థమయ్యేటటు వంటి సాంకేతిక పదకోశము
ఇంగ్లీషులో వీళ్ళ గోల అర్థం కాక చస్తున్నాను. పోనీ, అర్థంకానిది వ్యర్థం అని పక్కన తోసేద్దామంటే, నిరుద్యోగం, గందరగోళం, కలహం, అనర్థం అని భయపెట్టిస్తూ ఉంటారు. తెలుగులో నైనా వీరి అక్షరక్రమములు అర్థమవుతాయని ఆశ.
ఇన్ని ప్రయోజనాలున్నందున అర్థ శాస్త్రము, ముఖ్యంగా దేశ పాలసీ విషయాలపై దృష్టిని కేంద్రీకరించిన స్థూల అర్థ శాస్త్రమును తెలుగులోనే అభ్యసించడం అందరికీ మేలు.
అలాగే, కంచెర్లకోట గారు ఒక మాట: కృగ్ మెన్ గారి వాఖ్యలలో జాతి వివిక్షత లేదనే అనుకొని, ఆయన మాట వినక, అచ్చులనూ, గుణింతాలనూ తీయకుండా మీ పేరును మీరే ముందర సరిగ్గా పలకండి చెప్పుతాను. ఆ తరువాత, తెలుగులో ఆలోచిస్తూ, గుణింతాలూ, వొత్తులూ, హల్లులతో కూడి ఐటీ రంగంలో వచ్చినంత విప్లవాన్ని ఆర్థిక ఇంజినీయరింగ్ మళ్ళీ రప్పించి తుఱ్ఱుమందాము!
2010-09-22
బ్లాగు నిర్లక్ష్యమైనది కానీ, నిర్జీవం కాదు
ఎవరూ ఇక్కడ ఏమీ చదవట్లేదనుకున్నా. పొరపాటే! మొననే ఎవరో చదువుతున్నారని చెప్పితేను, సరే మళ్ళీ ఇక్కడే పోస్టు చెయ్యడం పునఃప్రారంభిద్దామని నిశ్చయించుకున్నాను.
కిందటి టపాకీ, ఇప్పటికీ మార్పులు కొన్ని. ఊళ్ళు రెండు సార్లు మారాను, కంపెనీ ఒకసారి, కార్యాలయాలెన్నో సార్లు. వొళ్ళు పెరిగింది, తలపై జుట్టు తగ్గింది. టైం ఇంకాస్త వేగంగా పరుగుతోంది. రేపో మాపో పెళ్లి చేసుకో అంటున్నారు; పెళ్ళి అయ్యే ముందు నాకు పెళ్ళి చేస్తారని అనిపిస్తోంది.
తెలుగు తల్లిపై ప్రేమ, మమకారం తగ్గక, ఇంకా పెరిగినట్టు అనిపిస్తోంది. భాషాశాస్త్ర విషయాలపై మరింత విషయాలూ, విశేషాలతో మీముందు మళ్ళీ వుంటాను.